ధర్మవన నేచర్ ఆర్క్ వ్యవస్దాపకులు ఫెడ్రిక్ విలియం
మాలక్ష్మి గ్రూపు నిర్వహణలో యార్లగడ్డ శ్రీరాములు ధార్మిక ఉపన్యాసం
విజయవాడ : ఇతర పాఠ్యాంశాల మాదిరిగానే పర్యావరణ శాస్త్రాన్ని పాఠశాల స్దాయి
నుండే చిన్నారులకు నేర్పవలసిన తరుణం ఆసన్నమైందని హైదరాబాద్ సమీపంలో భువనగిరి
వద్ద ధర్మవన నేచర్ ఆర్క్ వ్యవస్దాపకులు ఫెడ్రిక్ విలియం డుర్ అన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకునే క్రమంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యతను
సంతరించుకుందన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ , పర్యావరణ పర్యాటకం అనే అంశంపై
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, మాలక్ష్మి గ్రూపు సంయిక్త నిర్వహణలో యార్లగడ్డ
శ్రీరాములు 19వ ధార్మిక ఉపన్యాసం విజయవాడ నోవాటెల్ లో సోమవారం నిర్వహించారు.
కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఫెడ్రిక్ విలియం మాట్లాడుతూ పర్యావరణంతో
ఎటువంటి సయోధ్యను కలిగి ఉండాలన్న విషయం నిత్య చర్యనీయంశం కావాలని, అది
విద్యావ్యవస్ధలో అంతర్భాగంగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుందన్నారు. పర్యావరణ
సమతౌల్యత పరంగా ఇప్పటికే అపారనష్టం జరిగిందని, ఇప్పటికైనా దానిని
సరిదిద్దకపోతే భావి తరాలు శూన్యం అవుతాయని స్పష్టం చేసారు. అందరం కలిసి
సంయిక్తంగా బాధ్యత తీసుకుంటేనే పర్యావరణ అసమతౌల్యత వల్ల ఎదురయ్యే కష్టాలను
అధికమించగలుగుతామన్నారు. పర్యావరణం అంటే జీవం అని గుర్తించాలని, జీవజాలాన్ని
నాశనం చేసుకుంటూ పోతే అది మానవ జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపుతుందని
ఫెడ్రిక్ విలియం స్పష్టం చేసారు. మాలక్ష్మి గ్రూపు వ్యవస్ధాపకులు యార్లగడ్డ
హరిశ్చంద్ర ప్రసాద్ మాట్టాడుతూ వాతావరణ సమతుల్యత కోసం మొక్కల పెంపకం ఒక్కటే
పరిష్కారమన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం మంచి మూలాలు, సుదీర్ఘ జీవిత కాలం
కలిగిన మొక్కల నుండి విత్తన సేకరణ జరగాలన్నారు. హైబ్రీడ్ విధానాలను
కాదనలేనప్పటికీ విత్తన పరిరక్షణలో సాంప్రదాయకతను కాపాడుకోవలసి ఉందన్నారు.
సైన్సు ఏమి చేయాలో, చరిత్ర ఏమి చేయకూడదో చెబుతుందని ఈ రెండింటినీ సమన్వయం
చేసుకుని ముందుడుకు వేయాలన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఛైర్మన్ ఆచార్య
హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సమాజానికి ఉపయోగపడేలా యార్లగడ్డ
శ్రీరాములు పేరిట మాలక్ష్మి గ్రూపు ధార్మిక ఉపన్యాసం నిర్వహించటం
స్పూర్తిదాయకమన్నారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర కార్యదర్శి
డాక్టర్ సివి శ్రీరామ్ మాట్లాడుతూ ఉపన్యాసాలకే పరిమితం కాకుండా మాలక్ష్మి
గ్రూపు జీవవైవిద్యం కోసం ప్రత్యేక శ్రమ తీసుకోవటం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్ధాపకురాలు డాక్టర్ యార్లగడ్డ
తేజశ్వని, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్, మాలక్ష్మి గ్రూపు సిఇఓ మండవ
సందీప్, ధర్మవన నేచర్ ఆర్క్ వనం సిఇఓ శారద, ప్లీచ్ ఇండియా సిఇఓ ఈమని
శివనాగిరెడ్డి, ఆలపాటి శ్రీనివాసరావు, సీనియర్ ఇంజనీర్, భారత పరిశ్రమల సమాఖ్య
( సిఐఐ ) ప్రతినిధులు, యంగ్ ఇండియన్స్ ఇంకా ఔత్సాహిక ఇంజనీర్లు పాల్గొన్నారు.