బాపులపాడు మండలంలో తడిసిన పనలు, రంగుమారిన ధాన్యాన్ని పరిశీలించిన తెలుగుదేశం
పార్టీ నేతలు
విజయవాడ: తుఫాన్ కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి
రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య
రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈరోజు
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కమిటీ
ఆధ్వర్యంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట
గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని
ఉమా వరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుదేశం
పార్టీ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్య, మండల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా
సురేష్ తదితరులు తుఫాన్ దాటికి తడిసిన పనలను, రంగు మారిన ధాన్యాన్ని రైతులతో
కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి
అసమర్థ పాలన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని 2022 ఏడాది ఖరీఫ్ సీజన్లో
ధాన్యం సేకరణను రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించగా ఆ
ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాండస్ తుఫాన్
దాటికి వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని కోతకు వచ్చిన వరి నేలకు వాలిందని,
కోసిన పంట పనల మీద పూర్తిగా మునిగిపోయిందని,పొలాల్లో ఆరుబయట ఆరబోసిన ధాన్యం
పూర్తిగా తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాష్ట్ర
ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ లో 9.63 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని
అంచనా వేసి కొనుగోలను పౌరసరఫరా సంస్థ తరఫున 5.06 లక్షల మెట్రిక్ టన్నులకు
కుదించడం చాలా దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని సకాలంలో
కొనుగోలు చేయకపోవడం వల్ల ఎక్కడి దాన్యం అక్కడే కల్లాల్లో ఉందని ఈ తీవ్ర
పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వర్షానికి తడిసిన, రంగు మారిన
ధాన్యాన్ని ప్రకటించిన మద్దతు ధర కు వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని
డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో సరిపడా పట్టాలు లేవని ఆర్బికేలు బోగస్
కేంద్రాలుగా మారాయని ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించి రాష్ట్ర ప్రభుత్వం
దళారులకు అమ్ముకోవాలని సూచించటం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు
నేతలు మజ్జిగ నాగరాజు, కొండపల్లి వెంకటేశ్వరరావు, స్థానిక రైతులు వక్కలగడ్డ
చంద్రశేఖర్, అట్లూరి సుబ్బారావు, చెన్నుబోయిన మల్లికార్జునరావు, జువ్వాల
ప్రసాద్, కూరపాటి జోజి తదితరులు పాల్గొన్నారు.