తుపాను బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి : తుపాన్ బాధిత రైతులకు తక్షణమే ఆర్థికసాయం అందించాలని జనసేన అధినేత
పవన్ కల్యాణ్ సూచించారు. మద్దతుధర, ప్రభుత్వ సహకారాలు అందక తీవ్రఇబ్బందుల్లో
రైతులు ఉన్నారని తెలిపారు. తుపాన్ ధాటికి లక్షలాది ఎకరాల్లో పంటలు
నీటిపాలయ్యాయన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు
ధైర్యం చెప్పట్లేదు?, ప్రత్యర్థులను తిట్టడానికి నేతలకు స్క్రిప్ట్‌లు పంపే
తాడేపల్లి పెద్దలు రైతులను ఆదుకోవాలని తమ నేతలకు ఎందుకు చెప్పరు? అని ఆయన
ప్రశ్నించారు. ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక
అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రైతులను మాండౌస్ తుపాను మరోసారి దెబ్బ తీసింది.
కోతకు వచ్చిన చేలు, కల్లంలో ఉంచిన ధాన్యం కళ్లెదుట నీటిలో నానిపోతుంటే
దైన్యంగా చూస్తున్న రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోంది. ఉమ్మడి
జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి
ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి పంట నీటిపాలైంది. పత్తి లాంటి వాణిజ్య పంట,
బొప్పాయి, అరటి వంటి పండ్ల తోటలు తుపాను ధాటికి నేల రాలాయి. ఇంత జరుగుతున్నా
మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పరు?
ప్రత్యర్థి రాజకీయపక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ, ఏ
తిట్లు తిట్టాలో స్క్రిప్టులు పంపే తాడేపల్లి పెద్దలు ఇటువంటి విపత్కర
పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు చెప్పరు? అని
ప్రశ్నించారు.
లక్షన్నర ఎకరాలలో వరి పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఇంకొన్ని లక్షల
ఎకరాలలో చేలు నీటిలో నానుతున్నాయి. అందువల్ల తుపాను దెబ్బతో నష్టపోయిన రైతుకు
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అండను ఇవ్వాలి. సహేతుకమైన నష్టపరిహారాన్ని
ప్రతి ఎకరాకు చెల్లించాలి. కల్లంలోని తడిసిన ధాన్యాన్ని ఇప్పటికైనా తక్షణం
కొనుగోలు చేయాలి. కూరగాయలు, పండ్లతోటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్
చేస్తున్నాం. అదే విధంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు విజ్ఞప్తి
చేస్తున్నా. రైతులకు చేతనైనంతగా సహాయపడండి. నష్టంతో అసహాయంగా ఎదురుచూస్తున్న
రైతుల పక్షాన నిలబడండి. వారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
రైతాంగానికి మానసిక ధైర్యం కల్పించండి. సాయం అందకపోతే ప్రజాస్వామ్య రీతిలో
ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.