యువతకు జాబ్ కార్డులను నిలిపివేయాలని చెప్పడం దుర్మార్గం
ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై జనసేనకు ప్రత్యేక ప్రణాళిక
అనకాపల్లిలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
అనకాపల్లి : మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అపార నష్టం జరిగితే, రైతులకు
అనుకోని ఆపద వస్తే కనీస సహాయక చర్యలు చేపట్టాల్సిన ఈ ప్రభుత్వం, దాన్ని
వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు
ముగించుకొని వస్తూ అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో
మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఉద్యోగాలు ఇవ్వలేని ఈ
ప్రభుత్వం యువతకు ఇవ్వాల్సిన జాబ్ కార్డులను ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేయడం
చేతగానితనం. రాత్రికి రాత్రి యువతకు న్యాయబద్ధంగా ఉపాధి కార్యాలయాల్లో
ఇవ్వాల్సిన జాబ్ కార్డులు నిలుపుదల చేయాలని చెప్పడం ఈ ప్రభుత్వ చేతకానితనం.
యువతకు ఉద్యోగాలు కల్పన ఎలాగూ చేయని ఈ ప్రభుత్వం ఇప్పుడు జాబ్ కార్డు లు
నిలుపుదల చేయాలని చెప్పడం చూస్తే వారి చిత్తశుద్ధి అర్ధం అవుతుంది. యువతకు
కచ్చితంగా జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. సమస్యలు పక్కదారి పట్టించడానికి
రోజుకో విచిత్రమైన విషయం మీద ఈ ప్రభుత్వ మంత్రులు మాట్లాడడం సిగ్గు చేటు. శ్రీ
పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం అని చెప్పగానే ఈ పాలకులకు భయం
పట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వ పాలన మీద చాలా
కోపంతో ఉన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆవేదన అనంతం : ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం
నియోజకవర్గాలు సమీక్ష సమావేశంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అక్కడి
ప్రజల ఆవేదన అనంతం. కనీస సమస్యలు తీరడం లేదని, ప్రజా ప్రతినిధులకు చెబుతున్న
పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో కనీసం తాగునీటి
సదుపాయం లేదు. రైతుల్ని యువతను ఆదుకోండి వారి సమస్యలు తీర్చండి. అని మేము
అడుగుతుంటే రోజుకో విచిత్రమైన వితండవాదం తెరపైకి తెస్తున్నారు. ఉత్తరాంధ్ర
నాయకులు పదవులు కాపాడుకోవడానికి ఆస్తులు పెంచుకోవడానికి పనిచేశారు. తప్పితే,
అక్కడి ప్రజల సమస్యలు ఏమాత్రం తీరలేదు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర యువత కోసం
ఇక్కడ వలసలను నిరోధించడం కోసం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుంది. కచ్చితంగా
యువతకు ఉపాధి దారి చూపేలా పని చేస్తాం. జనవరి 12వ తేదీన జనసేన పార్టీ
ఆధ్వర్యంలో చేపట్టబోయే యువశక్తి కార్యక్రమంలో యువతకు జనసేన ప్రభుత్వంలో ఏం
చేస్తాం అన్న సమగ్ర ప్రణాళికను పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు. ఉత్తరాంధ్ర
సంస్కృతి, సాహిత్యం, సమస్యలు చాటి చెప్పేలా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ
సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ అధికార ప్రతినిధులు
పరుచూరి భాస్కరరావు, సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ కార్యక్రమాల
నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు
పీవీఎస్ఎన్ రాజు, పసుపులేటి ఉషా కిరణ్, పీతల మూర్తి యాదవ్ తదితరులు
పాల్గొన్నారు.