నరసన్నపేట : సమాజంలో మహిళాచైతన్యంతోనే ఆర్థిక వికాసం సాధ్యమవుతుందని రాష్ట్ర
మాజీ ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
నరసన్నపేటలో బుధవారం 24 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన చేయూత మహిళ మార్టును ఆయన
ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో
మహిళలు ముందంజలో ఉండే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి
చేస్తున్నారని అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరిటే మంజూరు
చేస్తున్నారని గుర్తు చేశారు. జగనన్న కాలనీల ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరిట
ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని పాలుపంచుకుంటూ తాను మరియు
తన స్నేహితుడు శాస్త్రి శ్రీకాకుళంలో భారత గ్యాస్ ఏర్పాటు చేశామని ఆ సంస్థలో
మహిళలకు పెద్ద పీట వేస్తూ వారికే ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని అన్నారు. ఈ
క్రమంలోనే దేశంలోనే అత్యున్నత గ్యాస్ కంపెనీగా తాము నిర్వహిస్తున్న భారత్
గ్యాస్ ఏజెన్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మహిళలు అన్నింటా ముందుండాలని, తద్వారా మహిళా సాధికార తో పాటు ఆర్థిక అభివృద్ధి
చెందే అవకాశాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా తన
నియోజకవర్గ పరిధిలోని నరసన్నపేటలో చేయూత మహిళ మార్ట్ ను ప్రారంభించుకోవడం
ఆనందంగా ఉందని అన్నారు. మండలంలోని మహిళా సంఘాలలో 22,434 మంది సభ్యులు ఉండగా
ఒక్కొక్కరు 110 రూపాయలు సమకూర్చుకొని సుమారు 24 లక్షల రూపాయలతో వారే సొంతంగా ఈ
మారును ఏర్పాటు చేయడం స్వాగతించవలసిన అంశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 18
లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్,
జిల్లా పరిషత్ సభ్యురాలు చింతు అన్నపూర్ణ రామారావ్, స్థానిక మేజర్ పంచాయతీ
సర్పంచ్ బూరెల్లి శంకర్రావు, ప్రజా ప్రతినిధులు, వెలుగు ఏజీఎం సత్యనారాయణ,
ఏరియా కోఆర్డినేటర్ కొండలరావు, మహిళా సమాఖ్య, అధ్యక్షురాలు చింటూ శ్రీదేవి,
వెలుగు సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.