ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయ్
కొవిడ్ ఆంక్షలతో తగ్గిన ఐఆర్సీటీసీ ఆదాయం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : కరోనా సమయంలో నిలిచిపోయిన రైళ్లలో వృద్ధులకిచ్చే రాయితీలను
ఇప్పట్లో పునరుద్ధరించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది. రైళ్లలో సీనియర్
సిటిజన్లకు రాయితీ ఇప్పట్లో లేనట్లేనని కేంద్రం స్పష్టంచేసింది.
ఇప్పటికిప్పుడు రాయితీని పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి
అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌కు తెలియజేశారు. రైల్వేలో పెన్షన్లు, వేతనాలు
ఇప్పటికే అధికంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో సీనియర్లకు రాయతీని పునరుద్ధరించడం
ఇప్పట్లో వీలుకాదని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్
రాణా అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఈ మేరకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. కరోనా
సమయం నుంచి ఈ రాయితీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘‘ప్రయాణికుల సేవల కోసం
ప్రభుత్వం గతేడాది రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చింది. ఇది చాలా రాష్ట్రాల
బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. అదే విధంగా పెన్షన్ల కోసం ఏడాదికి రూ.60వేల కోట్లు
ఖర్చు చేస్తోంది. వేతనాల కోసం రూ.97వేల కోట్లు ఖర్చవుతుండగా.. చమురు కోసం మరో
రూ.40వేల కోట్లు వెచ్చిస్తున్నాం’’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అదే సమయంలో
ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఏదైనా కొత్త
నిర్ణయం తీసుకుంటే.. రాయితీని అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ప్రస్తుతానికైతే సీనియర్ల రాయితీని తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి
ఒక్కరూ రైల్వే పరిస్థితిని కూడా చూడాలని కోరారు.
వందే భారత్ రైళ్ల గురించి వచ్చిన మరో ప్రశ్నకూ కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం సీటింగ్ సదుపాయంతో ఉన్న ఈ రైళ్లను గరిష్ఠంగా 500 -550 కిలోమీటర్ల
వరకు నడుపుతున్నామని, పడుకొనే సదుపాయం అందుబాటులోకి వస్తే దూర ప్రయాణాలకు ఈ
రైళ్లను వినియోగిస్తామని పేర్కొన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తయ్యాక
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రానికి రైళ్లను అందుబాటులోకి
తీసుకొచ్చే ప్రణాళిక ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41 ప్రధాన
రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని, మిగిలిన స్టేషన్లను దశలవారీగా
చేస్తామని చెప్పారు. 2030 నాటికి రైల్వేను కాలుష్య రహితంగా మార్చాలని
లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
*కొవిడ్ ఆంక్షలతో తగ్గిన ఐఆర్సీటీసీ ఆదాయం : కొవిడ్ ఆంక్షల కారణంగా
2020-2021లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రెవెన్యూ
గణనీయంగా తగ్గిందని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. 2019-2020లో
ఐఆర్సీటీసీకి రూ.2,342.41 కోట్ల ఆదాయం రాగా.. . కొవిడ్ కారణంగా 2020-21లో
గణనీయంగా తగ్గి రూ.861.64 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. కొవిడ్ కేసులు
తగ్గడం, ఆంక్షల సడలింపుతో రెవెన్యూ పుంజుకుందన్నారు. 2021-22 ఆర్థిక
సంవత్సరంలో 1952.30 కోట్లు ఆదాయం ఆర్జించిందని చెప్పారు. 2019లో రూ.11,644
కోట్లుగా ఉన్న ఐఆర్సీటీసీ మార్కెట్ విలువ 2022 మార్చి 31 నాటికి రూ.61,976
కోట్లకు చేరిందన్నారు. రైల్వే టికెట్ బుకింగ్ కోసం బుకింగ్ కోసం
ఈజీమైట్రిప్ , మేక్మైట్రిప్ వంటి యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని
తెలిపారు.
మళ్లీ పాతపాటే పాడుతున్నారు ఈ రైల్వే మంత్రి : రైళ్లలో సీనియర్ సిటిజన్లకు
రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెదవి విరిచింది. ఖర్చులు
తడిసిమోపెడవుతున్నందున ఇప్పటికిప్పుడు రాయితీలు పునరుద్ధరించ లేమని కేంద్ర
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు
టిక్కెట్ల రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మహారాష్ట్రకు చెందిన
ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభలో బుధవారంనాడు అడిగిన ప్రశ్నకు మంత్రి
ఈమేరకు సమాధానం ఇచ్చారు. గతంలో సీనియర్ సిటిజన్లకు రైళ్లలో 40 నుంచి 50 శాతం
టిక్కెట్ రాయితీ ఉండేది. కరోనా సమయం నుంచి ఈ రాయితీలను కేంద్ర నిలిపివేసింది.
”గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చాం. ఇది పలు
రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ. పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా
ఉన్నాయి” అని మంత్రి తన సమాధానంలో తెలిపారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు
రూ.60,000 కోట్లు ఉందని, వేతన బిల్లులు రూ.97,000 కోట్లు, ఇంధనం కోసం
రూ.40,000 కోట్లు ఖర్చవుతున్నాయని ఆయన చెప్పారు. ఒకవేళ ఏదైనా కొత్త నిర్ణయాలు
తీసుకుంటే అప్పుడు రాయితీ అంశాన్ని పరిశీలిస్తామని, ప్రస్తుతానికైతే ఆ
పరిస్థితి లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ రైల్వేల స్థితిగతులను చూడాలని కోరారు.