ఎల్ఏసీ వద్ద చైనా తీరును తప్పుబట్టిన అమెరికా
సరిహద్దుల్లో భారత్ చర్యలకు మద్దతు
భాగస్వాముల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
అమెరికా : అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద
భారత్-చైనా దళాల ఘర్షణపై అమెరికా స్పందించింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు
భారత్ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అమెరికాలోని
రక్షణశాఖ కేంద్రం పెంటగాన్ ఓ ప్రకటన జారీ చేసింది. ‘‘భారత్-చైనా
సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిణామాలను మా రక్షణ శాఖ
జాగ్రత్తగా గమనిస్తోంది. సరిహద్దుల్లో చైనా నిరంతరాయంగా దళాల మోహరింపు, సైనిక
మౌలిక వసతుల నిర్మాణాలు చేపడుతోంది. చైనా ఇండో-పసిఫిక్‌లోని అమెరికా మిత్రులు,
భాగస్వాములను కవ్వించే వైఖరికి ఇది అద్దంపడుతోంది. మా భాగస్వాముల భద్రతకు
సహకరించేందుకు దృఢంగా కట్టుబడి ఉన్నాం. ఉద్రిక్తతలు తగ్గించే విషయంపై భారత్
తీసుకొంటున్న చర్యలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం’’ అని పెంటగాన్ ప్రతినిధి
పాట్ రైడర్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ కూడా యాంగ్జే వద్ద
ఘర్షణపై స్పందించింది. ‘‘భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని
జాగ్రత్తగా గమనిస్తున్నాం. వీటిని తగ్గించుకోవడానికి ఇరుపక్షాలు వెంటనే చర్యలు
చేపట్టడం సంతోషకరం. భారత్‌లోని మా భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తాం. భారత్
ద్వైపాక్షికంగానే కాదు. క్వాడ్ వంటి ఇతర వేదికలపై కూడా మాకు వ్యూహాత్మక
భాగస్వామి. ఆ విషయాన్ని మేం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొంటాం. ఎల్ఏసీ వెంట
ఏకపక్షంగా యథాతథ పరిస్థితిని మార్చేందుకు యత్నించడాన్ని వ్యతిరేకిస్తాం.
ద్వైపాక్షిక మార్గాలను వినియోగించుకొని విభేదాలపై చర్చించుకొనేలా
భారత్-చైనాను ప్రోత్సహిస్తాం’’ అని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్
ప్రైస్ పేర్కొన్నారు. మరోవైపు ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్
కూడా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
టిక్‌టాక్‌పై నిషేధానికి రంగం సిద్ధం : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్
టిక్‌టాక్‌పై నిషేధం విధించేందుకు అమెరికా చట్టసభలో రంగం సిద్ధమవుతోంది. ఆ
దేశంలోని రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఒక
బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు. అమెరికా వాసులపై నిఘా కోసం చైనా ఈ యాప్‌ను
వినియోగించుకోవచ్చేమోనన్న ఆందోళనను ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన మార్కో రూబియో, మైక్ గల్లాఘర్, డెమోక్రాటిక్
పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు
ప్రకారం రష్యా, చైనాల ప్రభావం ఉన్న ఏ సోషల్ మీడియా సంస్థనైనా నిరోధించడానికి
ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.