పైసా ప్రయోజనం కల్పించకుండానే పదవులు పూర్తి
ఉత్సవ విగ్రహాల్లా బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు
గుంటూరు : పదవి తీసుకున్నాక ప్రమాణ స్వీకారం..ఇప్పుడు పదవీ విరమణ తప్ప బీసీ
కార్పొరేషన్ ఛైర్మన్లు రెండేళ్ల పదవీ కాలంలో ఏ ఒక్కరికీ పైసా ప్రయోజనం చేయని
విధంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవస్థను నాశనం చేశారని టీడీపీ రాష్ట్ర
అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. బీసీ యువతకు స్వయం ఉపాధి
కల్పించి, సొంత కాళ్లపై నిలబడేలా చేసే కార్పొరేషన్లకు రూపాయి కూడా బడ్జెట్
కేటాయించకుండా కాళ్లు విరిచేశారన్నారు. 56 మందిని ఛైర్మన్లుగా నియమించిన జగన్
రెడ్డి వారి కోసం ఎంత మొత్తం కేటాయించారో చెప్పే సాహసం చేయగలరా? అని
ప్రశ్నించారు. ‘బీసీలకు ఏం చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలకు
దిగుతున్నారు. లెక్కలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇదేనా
బీసీ సంక్షేమం? ఇదేనా బీసీలకు స్వావలంబన కల్పించడం? బీసీ కార్పొరేషన్లకు
బడ్జెట్ కేటాయించకపోగా.. 2018-19లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 70వేల
రుణాలను రద్దు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి పథకాలు
రద్దు చేసి బీసీ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం
ఐదేళ్ల కాలంలో బీసీ కార్పొరేషన్లకు ఏటా రూ.1200 కోట్లు చొప్పున ఐదేళ్లలో
రూ.6వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసింది. 4.20 లక్షల మంది యువతకు రూ.2లక్షల
చొప్పున స్వయం ఉపాధి రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. 70వేల మందికి
ఫెడరేషన్ల ద్వారా గ్రూప్ రుణాలిచ్చింది’ అని గుర్తు చేశారు.
‘బీసీ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినపుడే బీసీల స్వావలంబన సాధ్యమని
తెలుగుదేశం పార్టీ నమ్మింది. ఆచరించి అమలు చేసింది. కానీ, బీసీలు అంటే ఓట్లు
మాత్రమే అనే పరిస్థితి జగన్ రెడ్డి కల్పించారు. చేతి వృత్తులపై ఆధారపడే వారికి
నాడు ప్రోత్సాహకాలిచ్చి అండగా నిలిస్తే నేడు వారి చేతులు కట్టేసి ఓట్లు
వేయించే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారు. పైగా బీసీలను అణచివేయడమే
లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలకు తెరలేపారు. 26 మంది బీసీల్ని హత్య చేశారు. 650
మందిపై తప్పుడు కేసులు పెట్టారు. 2500 మందిపై దాడులకు పాల్పడ్డారు. బీసీ
రిజర్వేషన్లను కుదించి 16,800 మందిని రాజ్యాధికారానికి దూరం చేసి బీసీలను
నయవంచన చేశారు. జగన్ రెడ్డీ.. నీ దాష్టీకాలకు ఘోరీ కట్టేందుకు బీసీలు
ఏకమయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై బంగాళాఖాతంలో నిన్ను
పడేయడం ఖాయమని గుర్తుంచుకోవాల’ని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.