పంటలు నష్టపోయినా కదలని ప్రభుత్వం
ఎకరాకు రూ. 10 వేల పరిహారం ప్రకటించాలి
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
తెనాలి, కొల్లిపర మండలాల్లో నష్టపోయిన పంటల పరిశీలన
తెనాలి: వైసీపీ పాలనలో రైతులను పలకరించే దిక్కే లేకుండా పోయిందని,
రైతాంగం-వ్యవసాయం అంటే ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయని జనసేన పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తుపాను వచ్చి పంటలు
నష్టపోతే పలకరించే నాథుడు లేడని ఆరోపించారు. కౌలు రైతుల్ని అసలు పట్టించుకునే
పరిస్థితులే లేవన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు.
రైతుకి రాజకీయం.. కులం అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం తెనాలి,
కొల్లిపర మండలాల్లో తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు.
తేలప్రోలు, అత్తోట గ్రామాల పరిధిలో మొలకలు వచ్చేసిన వరిని రైతులు మనోహర్ కు
చూపించారు. ఇంత నష్టం వచ్చినా కనీసం పంట నష్టం అంచనా వేసేందుకు కూడా ఎవరూ
రాలేదని వాపోయారు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఎక్కువ నష్టం
వాటిల్లిన విషయాన్ని వివరించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ
‘రైతు పరిస్థితి దారుణంగా ఉంది. వరుసగా మూడేళ్లుగా పంటలు నష్టపోతూనే ఉన్నారు.
తెనాలి, కొల్లిపర మండలాల్లో కలిగిన పంట నష్టం చూస్తే బాధ కలుగుతోంది.
ప్రభుత్వం, యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్ధం అవుతోంది.
వీఆర్వోలు, వాలంటీర్లు, వ్యవసాయ అధికారులు ఎవరూ పొలాల్లోకి రాలేదు. వేల కోట్లు
ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక్క అధికారి గాని,
స్థానిక ప్రజా ప్రతినిధులు గాని వచ్చి రైతులను ఓదార్చకపోవడం అన్యాయం. వరుసగా
జరుగుతున్న పంట నష్టం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి రైతుకూ ఎకరాకు
రూ.30 వేలు ఖర్చు చేశాఋ’ అని పేర్కొన్నారు.
‘పంట నష్టం వాటిల్లితే కనీసం అంచనాలు వేయడం లేదు. కౌలు రైతుల్ని అయితే
పూర్తిగా గాలికి వదిలేశారు. విత్తనం లేదు, ఎరువు ఇవ్వడం లేదు. కనీసం పంట
కాలువల్లో పూడిక కూడా తీయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఏమయ్యాయో అర్ధం
కావడం లేదు. రైతులు సమస్యల్లో ఉంటే ప్రభుత్వానికి స్పందించే మనస్తత్వం ఎందుకు
లేకుండా పోయిందో అర్ధం కావడం లేద’న్నారు.
రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం :
‘కౌలు రైతుల్ని పట్టించుకోకపోవడం వల్ల దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు
పాల్పడుతున్నారు. గుంటూరు లాంటి జిల్లాలోనే 300 మంది రైతులు ఆత్మహత్య
చేసుకున్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో
రైతు భరోసా సభ నిర్వహించి కుటుంబానికి రూ. లక్ష చొప్పున పవన్ కళ్యాణ్
స్వయంగా ఆర్థిక సాయం అందచేయనున్నారు. అదే వేదిక నుంచి నష్టపోయిన రైతుల తరఫున
ప్రభుత్వాన్ని పరిహారం డిమాండ్ చేస్తారని మనోహర్ వివరించారు.
పంట నష్టంపై ముఖ్యమంత్రి స్పందించాలి:
వ్యవసాయ శాఖ నుంచి నివేదిక తెప్పించుకుని ప్రతి రైతుని ఆదుకునే ఏర్పాటు
చేయాలి. గత ఏడాది తుఫాను వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున
నిరసన దీక్షలు చేపట్టాం. ప్రతి రైతుకూ రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
చేస్తే రూ. 6 వేలు చొప్పున ఇచ్చారు. అదీ తూతూ మంత్రంగా కొంత మందికి మాత్రమే.
ఈసారి సంభవించిన విపత్తు కారణంగా రైతులకు అపార నష్టం సంభవించింది. ఎకరాకు రూ.
10 వేల చొప్పున తక్షణ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
నియోజకవర్గంలో ఏడు లక్షల 75 వేల క్వింటాళ్ల పంట పండితే ఇప్పటి వరకు కేవలం 900
క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఆర బెట్టిన ధాన్యాన్ని కూడా తేమశాతం
పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకుని
రైతాంగానికి అండగా నిలబడతామ’ని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా చివలూరులో రైతు
భరోసా కేంద్రాన్ని మనోహర్ పరిశీలించారు. రైతుల వద్ద ఎంత ధాన్యం కొన్నారు? ఏ
పద్దతిలో కొంటున్నారు? కొన్న ధాన్యానికి ఎన్ని రోజుల్లో డబ్బు
చెల్లిస్తున్నారు? ఎరువులు ఎంత మందికి ఇచ్చారు? తదితర అంశాలపై ఆరా తీశారు.