కేంద్రం మోసం చేసిందన్నది అవాస్తవం..
విభజన హామీలు కేంద్రం నెరవేరుస్తుంది..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి
ఏలూరు: ఏపీని కేంద్రం మోసం చేసిందన్నది అవాస్తవం అని బీజేపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి పురందేశ్వరి స్పష్టం చేశారు. విభజన హామీలు అన్నింటినీ కేంద్రం
నెరవేరుస్తుందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. పోలవరం
ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం హామీ ఇచ్చినట్టుగానే, రాష్ట్రానికి అన్ని
విధాలుగా సాయం చేస్తున్నామన్నారు. ఏపీలో అన్ని శాఖల్లోనూ అవినీతి
పేరుకుపోయిందని పురందేశ్వరి విమర్శించారు. ఏపీలో మద్యం విక్రయాలపై డిజిటల్
పేమెంట్స్ ఎందుకు ఆమోదించడంలేదని ఆమె ప్రశ్నించారు. ఏలూరులో కార్పొరేషన్
శ్మశానాల్లో అంత్యక్రియలకు రూ.5 వేలు చొప్పున వసూలు చేయడం దారుణమని
వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం దివాళా దిశగా పయనిస్తోందనడానికి ఇదే
నిదర్శనమని అన్నారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు
ప్రచారాలను ఖండిస్తున్నానన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకీ
అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. విభజన హామీలన్నీ
నెరవేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము ఏమి చెయ్యలేదనడం
శోచనీయమన్నారు. పోలవరానికి సంబంధించి కేంద్రం హామీ ఇచ్చినట్లుగా, అన్నివిధాలా
రాష్ట్రానికి సహాయం చేస్తున్నామని తెలిపారు.