* వేలాదిగా హాజరైన భక్తులు
* కళ్ళు మిరుమిట్లు గొలిపేలా శోభాయమానంగా వేదిక నిర్మాణం
* భారీ ఎత్తున పుష్ప, విద్యుత్ అలంకరణలు
* ఆకట్టుకున్న అన్నమాచార్య సంకీర్తనల గానం
* గోవింద నామస్మరణతో మార్మోగిన జిల్లా స్టేడియం మైదానం
తిరుపతి : కర్ణాటక రాష్ట్రం రామనగరలోని జిల్లా స్టేడియం మైదానంలో శుక్రవారం
రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో దాత , శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కుమార
స్వామి, ఆయన సతీమణి, స్థానిక శాసన సభ్యురాలు అనిత కుమార స్వామి దంపతులు
నిర్వహించిన శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్ళు మిరిమిట్లు
గొలిపేలా శోభాయమానంగా నిర్మించిన కల్యాణ వేదిక, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన
పుష్ప , విద్యుత్ అలంకరణల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది
భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు. సాయంత్రం 6.30 గంటలకు
వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు
తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు,
మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన,
యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ
ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి,
మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం అత్యంత వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా
కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు
అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ
ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక
ఆవరణం మార్మోగింది. భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక
ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం
భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
కల్యాణంలో పాల్గొన్న మాజీ ప్రధాని దేవెగౌడ : మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి
సౌజన్యంతో నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ తన
సతీమణి చెన్నమ్మ దేవెగౌడతో పాటు పాల్గొన్నారు. టీటీడీ జేఈవో సదా భార్గవి
పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శేషాచల
దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో నిఖిల్
కుమార స్వామి గౌడ దంపతులు, ఎస్వి బిసి సిఈవో షణ్ముఖ్ కుమార్, శ్వేత డైరెక్టర్
ప్రశాంతి, హెచ్ డి పిపి ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, విజివో గిరిధర్, కల్యాణం
ప్రాజెక్టు ఎఈవో శ్రీరాములు, డిప్యూటీ ఈ ఈ లు సర్వేష్, మనోహర్ తో పాటు వేలాది
మంది భక్తులు, రామనగర జిల్లా అధికారులు పాల్గొన్నారు.