అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి పోస్టల్ శాఖ ద్వారా నేరుగా
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వున్న వైద్య
ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు సన్నద్ధం అవుతున్నారు.
ఇందుకు సంబందించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్
ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జి.వి.వి.ప్రసాద్ శనివారం
పత్రికల వారికి వివరించారు. భద్రత, భరోసా లేకుండా ఏళ్ల తరబడి కాంట్రాక్టు
ఉద్యోగంలోనే మగ్గుతున్న తమకు తప్పక న్యాయం చేసి రెగ్యులర్ చేసే మా ప్రియతమ నేత
జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవానికి పోస్టల్ శాఖ అవకాశం కల్పించిన విధంగా
శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగిగా ఆర్థికంగా ఎన్నో
బాధలు పడుతున్నా కేవలం 10 రూపాయలతోనే తమ నేతకు నేరుగా శుభాకాంక్షలు చెప్పే
అవకాశం కల్పించిన పోస్టల్ శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆయన అన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో నూటికి తొంభై శాతం నెరవేర్చిన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మిగిలిన పది శాతం హామీల్లో అత్యంత ప్రధానమైన
అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కూడా అతి త్వరలోనే చేసి
తీరుతారనే విశ్వాసంతో రాష్ట్రంలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులు, వారిపై
ఆధారపడిన కుటుంబాలు వున్నాయన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతగా వున్న
సమయంలో జగనన్నను కలిసిన సందర్భంలో తనకు ఇచ్చిన మాట, మ్యానిఫెస్టోలో ఇచ్చిన
హామీని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారని, రాష్ట్రంలో వేలాది కాంట్రాక్టు ఉద్యోగుల
కుటుంబాలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని ప్రసాద్ చెప్పారు. సంక్షేమ పథకాల
అమలులో అగ్రభాగాన నిలిచి అందరికీ అన్నీ చేస్తున్న ముఖ్యమంత్రి తమ విషయంలో కూడా
మాట తప్పక, మడమ తిప్పక సానుకూలంగా స్పందించి తీరుతారనే ఆశాభావాన్ని ఆయన
వ్యక్తం చేశారు. 21 వ తేదీన జరిగే జగనన్న జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు
తెలిపేందుకు ప్రతీ ఒక్క కాంట్రాక్టు ఉద్యోగి విధిగా సోమవారం నాడే పోస్టాఫీసు
కెళ్ళి 10 రూపాయలు చెల్లించి వారి ద్వారా మనందరం నమ్ముకున్న నేత కు హార్దిక
శుభాకాంక్షలు అందజేయాలని ప్రసాద్ కోరారు.