అభయ హస్తం కింద చెల్లించిన 500 డిపాజిట్లను వడ్డీతో సహ త్వరలో చెల్లింపు
నిపుణులను పెట్టి మహిళా సంఘాల ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ కల్పిస్తాం
దేశంలో మహిళా సంఘాలకు అత్యధిక రుణాలు ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వమే
స్వయం సహాయక బృందాల జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు
రైతు వేదికల వలె మహిళా వేదికలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసిఆర్
నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా
శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి,
భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సిఎం కేసిఆర్ స్వయం సహాయక బృందాల్లో
షూరిటీ లేకుండా 3 లక్షల రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవషాత్తు చనిపోతే వారి
రుణాలను మాఫీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మూడు లక్షల రుణం
తీసుకుని కొంత చెల్లించిన తర్వాత చనిపోతే చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా వారి
కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు చెప్పారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వయం సహాయక
బృందాలకు జాతీయ స్థాయిలో నాబార్డు, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సమాఖ్య,
ఎనబుల్ సంస్థలు కలిసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో
అవార్డులు ఇచ్చే నేటి కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య
అతిధిగా హాజరై, విజేతలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.
జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కామారెడ్డి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార
సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణ భారత దేశ కేటగిరిలో హనుమకొండ జిల్లా
బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడం
పట్ల మంత్రి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదొక మంచి
కార్యక్రమం. నాకు ఆసక్తి గల కార్యక్రమం. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను.
గ్రామాలు, కుటుంబాలు అభివృద్ది చెందాలంటే మహిళల వద్ద డబ్బులు ఉండాలి గట్టిగా
నమ్ముతాను. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే వారిపై అరాచకాలు కూడా
తగ్గుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా
పనిచేసిన కాకి మాధవరావు వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు మహిళల పరిస్థితి
ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది అని గమనిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
మహానుభావులు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూప్స్ పెట్టారు.
అపుడు బ్యాంక్స్ దగ్గర మహిళలు కనిపిస్తే మహిళల మీద అభాండాలు వేసే వారు. కానీ
నేడు ఆ పరిస్థితి లేదు. ఇపుడు ఆర్ధికంగా మహిళలు పైకి వచ్చారు. కుటుంబం వారిని
గౌరవిస్తుంది. ఆ కుటుంబాన్ని మహిళలు కాపాడుతున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి
17 రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారు. వీరందరినీ అభినందిస్తున్నాను. తెలంగాణకు
రెండు అవార్డులు రావడం పట్ల ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. 35 ఏళ్ల
కింద డీసీసీబీ ప్రెసిడెంట్ గా నేను పని చేశాను. అప్పుడు ఈ వేదిక మీద ఉన్న
కోటయ్య గారు వరంగల్ లో పనిచేసినప్పుడు నేను తరచు కలిసేవాడిని. ఈ మహిళా
అభివృద్ధి సంస్థలో నేడు చాలా సీనియర్స్ ఉన్నారు. మహిళలు ఇంకా అభివృద్ధి
చెందాలంటే వారి సలహాలు అవసరం అన్నారు.
మాజీ సిఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ పెద్ద పెద్ద వారికే రుణాలు వస్తున్నాయని
అంటున్నారు. కానీ నేడు తెలంగాణలో మహిళలు కూడా కోట్ల రూపాయల రుణాలు తీసుకుని
వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళా సాధికారత కు ఎక్కువ
ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళా స్వయం సహాయక బృందాల అత్యుత్తమ పనితీరులో
దేశంలో మొదట తెలంగాణ, రెండవది ఏపీ రావడం మనకు గర్వ కారణం. ప్రభుత్వం మహిళలకు
వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. మహిళలు కూడా 100 శాతం తిరిగి చెల్లింపులు
చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మహిళా సంఘాలకు 4 వేల కోట్ల రూపాయల
రుణాలు ఇస్తే ఇపుడు తెలంగాణ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ జనాభా ఎక్కువగా ఉండడంతో 20వేల కోట్ల రూపాయలు
మహిళా రుణాలు ఇస్తోంది. తమిళనాడు ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు మహిళలకు
రుణాలుగా ఇస్తుండగా, మిగిలిన రాష్ట్రాలు వెయ్యి, రెండువేల కోట్ల చొప్పున
రుణాలు ఇస్తున్నాయి. మహిళలకు అత్యధిక రుణాలు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమని
గర్వంగా చెబుతాను. సీఎం కేసీఆర్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నిన్న
ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, ఇద్దరు సెక్రటరీలతో రివ్యూ చేశాం. అభయ హస్తం
కింద గతంలో 500 పెన్షన్ కోసం డిపాజిట్ తీసుకున్నారు. 500 పెన్షన్ ఇచ్చే వారికి
ఇప్పుడు మనమే 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి, వారు డిపాజిట్ చేసిన
మొత్తానికి వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని సిఎం ఆదేశించారు. త్వరలోనే
ఇస్తున్నాం. వడ్డీలేని రుణాలు కూడా రిలీజ్ చేయబోతున్నాం. మహిళలను పటిష్టం
చేయాలన్నది సీఎం కేసిఆర్ ఆలోచన. మండల కేంద్రంలో మహిళా సంఘాలకు కూడా రైతు
వేదికల వంటి భవనాలు కట్టాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. అవసరమైతే గ్రామాల్లో
కూడా ఈ భవనాలు కట్టాలన్నారు. రాష్ట్రంలో 17978 సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ
పటిష్టంగా ఉన్నాయి. మహిళా సంఘాలు ఆర్ధికంగా పైకి రావడానికి అన్ని వసతులు
గ్రామాల్లో కల్పించాలి. ప్రతి వ్యాపారంలో మహిళలు పటిష్టం కావాలి. స్త్రీ నిధి
ద్వారా ఒక్కో మహిళకు 3 లక్షల రూపాయల రుణం షూరిటీ లేకుండా ఇస్తున్నాం. 3 లక్షల
రుణం తీసుకున్న వారు చనిపోతే ఆ రుణం మాఫీ చేయమని సిఎం కేసిఆర్ చెప్పారు.
ఒకవేళ లక్షా 50 వేలు కట్టిన తర్వాత చనిపోతే లక్షా 50 వేలు వాపస్ ఇవ్వమని
చెప్పారు. డైరీ,కారం, పసుపు అన్ని కల్తీ వస్తున్నాయి. ఇవన్నీ మహిళలు తయారు
చేయాలి. మీ మీద నమ్మకం ఉంది. మిమ్మల్ని ఆ విధంగా అభివృద్ధి చేయాలి అన్నది
ప్రభుత్వ ఉద్దేశ్యం. గ్రామాల్లోని కూరగాయాలు, పూలు, పండ్లు, ఇతర అవసరాలకు
పట్టణాల మీద ఆధార పడొద్దు. గ్రామాలు స్వయం సమృద్దిగా మారాలి. గ్రామానికి
అవసరమైనవి గ్రామాల్లోనే పండించాలి. అవసరమైతే పక్క గ్రామాలకు ఎగుమతి చేసే
విధంగా పల్లెలు తయారు కావాలి. తెలంగాణ అంటేనే కరువు ఉండే. కరెంటు లేక, నీళ్లు
లేక ఘోరమైన పరిస్థితి ఉండేది. కానీ నేడు 24 గంటల కరెంట్, నీళ్ళు ఉన్నాయి.
కాళేశ్వరం వల్ల ఫుల్ వాటర్ వస్తోంది. రైతులు సంతోషంగా ఉన్నారు. పంటలు
పండించడంలో ప్రజలకు ఏదీ అవసరమో గుర్తించి, అదే పండించాలి. మహిళల్లో బాగా
చైతన్యం వచ్చింది. మీ మీద బ్యాంకులకు నమ్మకం పెరిగింది. మహిళలకు ఇచ్చిన రుణం
ఎక్కడికి పోదన్న ధీమా వచ్చింది. మహిళలు కాకుండా మిగిలిన వారికి అనేక షూరిటీలు
పెడితే గాని రుణాలు రావడం లేదు. ఏ షూరిటీ లేకుండా మీకు 3 లక్షల రూపాయలు రుణం
ఇస్తున్నారు. మహిళలు పరిశ్రమలు పెడుతారంటే కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నాం.
ఇంకా మీరు ముందుకు రావాలి అన్నది నా కోరిక. కామారెడ్డి మండల సమాఖ్య వారికి
మొదటి అవార్డు రావడం సంతోషం. రెండో అవార్డు ఏపి వారికి రావడం పట్ల
అభినందిస్తున్నాను. అవార్డులు వచ్చిన వారు, వాళ్ల గ్రామాల్లోని మిగిలిన వారికి
శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి. ఈ సమావేశంలో పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ సుల్తానియా, మాజీ సిఎస్ కాకి
మాధవరావు, నాబార్డు మాజీ చైర్మన్లు, చించల, కోటయ్య, సాధన్ సంస్థ సిఈవో మీనన్,
బర్డ్ డైరెక్టర్ శంకర్ పాండే, ఏపి మాస్ వైస్ చైర్మన్ మహిపారాలి, చైతన్య
మేనేజింగ్ ట్రస్టీ సుధా కొఠారి, ఏపి మాస్ సిఈఓ సి.ఎస్ రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.