ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ గురువారం తిప్పికొట్టారు. తాను ఎప్పుడూ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయలేదని అన్నారు. తన పదవీ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారం, దేశ రక్షణ కోసమే పని చేశానని ఆయన స్పష్టంచేశారు. పాక్ లెఫ్టినెంట్ జనరల్ అంజుమ్ తనపై చేసిన ఆరోపణలు వాస్తవాలు కాదన్నారు. మార్చిలోజరిగిన రాజకీయ సంక్షోభం, గందరగోళంలో కూడా తాను నిబద్ధతతో పనిచేశానన్నారు. ఆర్మీ చీఫ్ చెప్పినట్టు రాజ్యాంగ విరుద్ధమైన పనులు తమ నాయకుడు చేయలేదని పీటీఐ నాయకులు షా మహమూద్ ఖురేషీ, ఫవాద్ చౌదరి, షిరీన్ మజారీ, అసద్ ఉమర్ లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, పాక్ లెఫ్టినెంట్ జనరల్ అంజుమ్ ఇంతకు ముందు మార్చిలో రాజకీయ గందరగోళం మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన “రాజ్యాంగ విరుద్ధమైన, చట్టవిరుద్ధమైన చర్య”కు పాల్పడిందని ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.