బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం
అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో శనివారం సాయంత్రం
అధికారులతో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం
నిర్వహించారు. ఫిబ్రవరి 11వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, ఫిబ్రవరి 19వ
తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు
చేయాలని అధికారులను ఆదేశించారు.ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం
ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ
బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు
ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రగిరి, తిరుపతిలలో బ్రహ్మోత్సవాల కటౌట్లు
ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను
అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు.
ఆలయ ప్రాశస్యము తెలిసేలా ఎస్విబిసిలో ప్రోమో ప్రసారం చేయాలని అధికారులకు
సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన గరుడసేవ రోజున
అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే
మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్,
అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్.వి.సంగీత, నృత్య కళాశాల
ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు
భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి
ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య
కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స
కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా
చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను
ఆదేశించారు. టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ
వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
సమావేశంలో డిప్యూటీ ఈవోలు వరలక్ష్మి, గోవిందరాజన్, శాంతి, ఎస్ఇ ఎలక్ట్రికల్
వెంకటేశ్వర్లు, గో సంరక్షణ డైరెక్టర్ శ హరినాథ్ రెడ్డి, గార్డెన్ సూపరిండెంట్
శ్రీనివాసులు, ఈఈ మురళి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్, ఎస్ వి
ఆయుర్వేద కళాశాల సూపరిండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, ఇతర అధికారులు
పాల్గొన్నారు.