చంద్రబోస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని సత్కరించడానికి తెలుగు సినీ
పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లు ఒక దగ్గరకు చేరాయి. ‘RRR ఆస్కార్ వేడుక’ పేరిట
ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు
తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ అతిథులుగా విచ్చేశారు. అలాగే,
తెలుగు సినీ పరిశ్రమలోని అతిరథమహారథులు అంతా హాజరయ్యారు. యాంకర్, నటి ఝాన్సీ
వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడానికి
కారణం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అని.. వాళ్లకు
బదులుగా తాను, చంద్రబోస్ అవార్డులు అందుకున్నామని అన్నారు. ‘ఏ గుడిలోనైనా మూల
విగ్రహాలు ఉంటాయి. అవి బయటకు రావు కాబట్టి వాటికి బదులుగా ఊరేగింపులో
పాల్గొనడానికి ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. RRR సినిమాకు భారతదేశం తరఫున
ఆస్కార్ అనే ప్రతిష్టాత్మక పురస్కారం రావడం వెనుక ప్రధానమైన కృషి చేసినవాళ్లు,
మూల విగ్రహాల్లాంటి వాళ్లు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. వారు బయటికి రారు కాబట్టి
వారి తరఫున పురస్కారాలు, సన్మానాలు, అభినందనలు అందుకోవడానికి ఉత్సవ
విగ్రహాల్లా నేను, చంద్రబోస్ ఉన్నాం. మా వంతు ఎంతో కొంత ఉన్నప్పటికీ ప్రధానమైన
కారణం వాళ్లిద్దరు’ అని కీరవాణి వెల్లడించారు.
తమను సత్కరించడానికి చలనచిత్ర పరిశ్రమ అంతా ఒక్కచోట చేరినందుకు తనకు ఎంతో
సంతోషంగా ఉందని కీరవాణి అన్నారు. ఇలా అన్ని క్రాఫ్ట్‌లకు చెందినవారు ఏదో ఒక
కారణంతో కలుస్తూ ఉండాలని కీరవాణి సూచించారు. అనంతరం తన ప్రయాణం గురించి..
ఆస్కార్ అందుకోవడానికి ముందు తన ఫీలింగ్స్ గురించి కీరవాణి చెప్పుకొచ్చారు.
‘నా మొట్టమొదటి పాట చెన్నైలో ప్రసాద్స్ 70ఎంఎం థియేటర్లో చేశాను. ఉన్నత
సాంకేతిక విలువలతో కూడిన ఆ థియేటర్లోకి అడుగుపెడితే దేవాలయంలోకి
అడుగుపెట్టినట్టే ఉంటుంది. అటువంటి థియేటర్లో ఫస్ట్ సాంగ్ రికార్డు చేయడమనేది
నాకు కృష్ణంరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. కొత్త
సంగీత దర్శకుడు కదా ఎక్కడో ఒక చోట సందులోని థియేటర్లో చేసేవయ్యా అని అనకుండా
అటువంటి ప్రతిష్టాత్మక థియేటర్లో నా మొదటి రికార్డింగ్ చేయించిన వారికి నా
కృతజ్ఞతలు’ అని కీరవాణి అన్నారు.
ఆస్కార్ అవార్డు రావడం వెనుక కృషి చేసిన రాజమౌళికి, ప్రేమ్ రక్షిత్‌కి,
అద్భుతంగా దాన్ని ప్రాక్టీస్ చేసి కష్టపడి చేసిన ఇద్దరు హీరోలకి, వాళ్లతో పాటు
ఉక్రెయిన్‌లో అద్భుతంగా డాన్స్ చేసిన డాన్సర్లు అందరికీ కృతజ్ఞతలు అని కీరవాణి
అన్నారు.